ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఈ ఏడాది సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట కలగనుంది. ఈ మేరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులను కంపార్ట్‌మెంట్‌ పాస్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల్లో 1.47 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. పాస్‌ అయిన వారిని కూడా రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పాం. అందుకు దాదాపు 73 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ కూడా 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారి రిజల్ట్స్‌ను ప్రకటిస్తాం. సెకండియర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను కంపార్టమెంట్‌ పాస్‌ చేస్తున్నాం. జూలై 31 తర్వాత వారి మార్కుల మెమోలు సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల పైచదువులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.