ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం మృతి

ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగా వైద్యులు పరిశీలించి మృతిచెందారని ప్రకటించారు. చిదంబరం స్వగ్రామం జిన్నారం మండలం శివానగర్‌. కాగా పటాన్‌చెరులో స్థిరపడ్డారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సమాజ సేవ, పర్యావరణంపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. పటాన్‌చెరు ప్రాంతంలో 1980 దశకంలో భారీగా ప్రారంభమైన రసాయన, ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల నుంచి వస్తున్న వాయు, జల కాలుష్యాలతో జరుగుతున్న నష్టంపై పోరాటం చేశారు.