తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీకేజీ కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ లీకేజీల కలకలం కొనసాగుతూనే ఉంది. విశాఖలో జరిగిన విషవాయువు లీకేజీ ఘటనను మరువకముందే తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా  మామిడికుదురు మండలం పాశర్లపూడి లంకలో ఓఎన్‌జీసీ  పైపులైన్‌ నుంచి స్వల్పంగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక అధికారులకు సమాచారం అందడంతో వారు సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.   విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మొత్తం 15 మంది మృతి చెందగా దాదాపు 500 మందికిపై విషవాయువు ప్రభావానికి లోనయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఎల్జీపాలిమర్స్‌ కంపెనీ సీఈవోతో పాటు ఇద్దరు డైరెక్టర్లతో సహ 12మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.