భారత్‌లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. దేశంలో కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,82,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 27,114 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. 519 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,20,916కు చేరింది.

ప్రస్తుతం 2,83,407 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా.. 5,15,385 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 22,123 మంది కరోనాతో బాధపడుతూ మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 1,13,07,002 కరోనా పరీక్షలు నిర్వహించారు.