తెలంగాణ వైద్యారోగ్యశాఖలో ఒకేసారి 1,418 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి నెల వేతనం రూ.70 వేలుగా పేర్కొన్నది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల కోసం 227 సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించనున్నారు. ఆర్నెళ్ల కాలానికి ఒప్పందపద్ధతిన నియమిస్తారు. పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ రెసిడెంట్స్ బాధ్యతలు అప్పగించనున్నారు. ఏడాది కాలానికి ఒప్పంద ప్రాతిపదికన 1,191 సీనియర్ రెసిడెంట్స్‌పోస్టులను భర్తీచేస్తారు. ఇందు లో గాంధీ దవాఖానకు 250 మందిని, కింగ్‌కోఠి దవాఖానకు 100 మందిని, గచ్చిబౌలిలోని టిమ్స్‌కు 150, చెస్ట్ హాస్పిటల్‌కు 50, ఎనిమిది ప్రభుత్వ వైద్యకళాశాలలకు 50 మంది చొప్పున 400, వైద్య విధాన పరిషత్ దవాఖానకు 241 మందిని కేటాయించనున్నారు.
