ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు : మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. శనివారం రెవెన్యూ,స్టాంప్‌, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిన నాలుగేళ్లకు పెంచుతూ  ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనకు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన రెవెన్యూ, స్టాంప్‌, రిజిస్ట్రేషన్‌ల శాఖ బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.నీతి నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న వారికి ఆదాయ సర్టిఫికెట్‌ అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కృష్ణదాస్‌ తెలిపారు. ఏపీలో భూసర్వేను త్వరలో ప్రారంభిస్తామని, భూ వివాదాలను పరిష్కరిస్తామని అన్నారు.

వైఎస్‌ జగన్‌ పాలన అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుండడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.