పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిదిరి అప్పలరాజు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్‌ కొత్త అథారిటీ ఏర్పాటుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని ఆయన తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. స్వయంగా మత్స్యకారుడినైన నాకు ఈ శాఖ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నానని సిదిరి  ఈ సందర్భంగా పేర్కొన్నారు.