సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఉన్న ఉపాధి కోల్పోవడంతో పొట్టకూటి కోసం పొలం పనులపై ఆధారపడ్డాడు. అయితే, దుక్కి దున్నేందుకు ఎడ్లు లేకపోవడంతో నాగేశ్వరరావు కుమార్తెలు పొలం దున్నేందుకు ముందుకొచ్చారు. బాలికలు పొలం దున్నుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై సోనూసూద్ స్పందించారు. బతుకుదెరువు కోసం కష్టపడుతున్న ఆ కుటుంబానికి తనవంతు సాయంగా ట్రాక్టర్ను పంపిస్తానని చెప్పాడు. అంతేనా ఆదివారం సాయంత్రానికల్లా తన హామీని కూడా నిలబెట్టుకున్నాడు. కాగా సోనూసూద్ గొప్ప మనసుపై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
