ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తి రోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు గ‌ల 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,051 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష మార్కును దాటి 1,02,349కి చేరింది. మొత్తం కేసుల‌లో 49,558 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 51,701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ర‌ణాల సంఖ్య కూడా ఇప్ప‌టికే 1090కి చేరింది. ఇక జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 14,696 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. క‌ర్నూలు (12,234), గుంటూరు (10,747), అనంత‌పూర్ (10,247) ఆ త‌ర్వాత స్థానంలో ఉన్నాయి. ఇక మ‌ర‌ణాల విష‌యానికొస్తే.. క‌ర్నూలులో అత్య‌ధికంగా 164 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కృష్ణా (149), తూర్పుగోదావ‌రి (129) ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.