గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం సందర్శించారు. ఆస్పత్రిలో కోవిడ్ -19 పాజిటివ్ రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. టిమ్స్ ఫార్మసీలో ఆక్సిజన్ సరఫరా, మందుల లభ్యత గురించి మంత్రి ఆరా తీశారు. టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమల థామస్, ఇతర సీనియర్ హెల్త్ ఆఫీసర్లు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హై-ఎండ్ కోవిడ్ -19 మందులైన రెమిడిసివిర్, డెక్సామెథాసోన్ సహా ఇతర ఔషదాలు టిమ్స్ లో తగినంత నిల్వలు ఉన్నాయన్నారు.
యాంటి వైరల్ కోవిడ్-19 డ్రగ్స్ స్టాక్ గురించి తెలుసుకునేందుకు మంత్రి టిమ్స్ ఫార్మసీని సందర్శించారు. రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తగినంత మొత్తంలో ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉందన్నారు. మంత్రి టిమ్స్ సీనియర్ వైద్యులతో మాట్లాడుతూ… తీవ్రమైన వైద్య స్థితిలో ఉన్న కోవిడ్ -19 పాజిటివ్ రోగులను మాత్రమే చేర్చుకోవాలన్నారు. అనంతరం ఇతర సీనియర్ హెల్త్ అధికారులతో కలిసి టిమ్స్ క్యాంపస్‌లో మంత్రి ఈటల రాజేందర్ మొక్కలు నాటారు.