ఏపీలో ఓ మంత్రికి ఇద్దరు ఎమ్మెల్యే లకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల నుంచి స్వల్ప జ్వరం ఉండటంతో ఆయన హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. తొలుత నెగెటివ్‌ రాగా, మంగళవారం సాయంత్రం పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. వెంటనే ఆయన చికిత్స కోసం అక్కడి అపోలో ఆస్పత్రిలో చేరారు.

అలాగే కరోనా బారిన పడిన చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుండగా, ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌కు కూడా పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఆయన భార్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు తేలడంతో ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,66,586 కి చేరగా, మరణాల సంఖ్య 1,537 కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 76,337 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారినపడ్డారు.