కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని పంజాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు. కరోనా నియమాలను అనుసరిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం గత జనవరిలో నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ ఉద్యోగాల కోసం పది లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో ఈ పరీక్ష నిర్వహించినట్లయితే కరోనా సమయంలో జరుగుతున్న అతిపెద్ద ఉద్యోగ నియామక పరీక్షగా నిలువనుంది.