శ్రీశైలం విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాద మృతులకు ఉప రాష్ట్రపతి సంతాపం

తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలోని శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడం బాధేసింది. నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించే’ నని వెంకయ్య నాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా శ్రీశైలంలోని లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ లో చిక్కుకున్న తొమ్మిది మంది అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేసింది. గురువారం రాత్రి 10:30 గంటల సమయంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ జలవిద్యుత్ ప్రాజెక్టు పవర్‌హౌస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలసిందే.

ఈ అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఘటనా వివరాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ద్వారా తెలుసుకుంటూ సహాయక చర్యలను కేసీఆర్‌ సమీక్షించారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నాగర్‌కూర్నూల్ కలెక్టర్ ఎల్ శర్మన్, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే జి బలరాజు ప్రమాద స్థలాన్ని సందర్శించారు.