శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ర్ట విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈగలపెంట దగ్గర జెన్‌కో ఆస్పత్రిలో మృతదేహాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద దురదృష్ట సంఘటన జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. డీఈ స్థాయి ఉద్యోగికి రూ. 50 లక్షలు, ఏఈలతో సహా మిగతా వారికి రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొన్న జెన్‌కో సిబ్బందిని మంత్రి అభినందించారు. రెస్క్యూ టీం చేసిన సహాయక చర్యలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
