గుమ్మడిదల బొంతపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన తీవ్రత భారీగానే ఉంది. మైళ్ల దూరం నుంచి మంటలు కనిపించాయి. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ఆపరేషన్లు కొనసాగించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. కెమికల్స్‌తో కూడిన భారీ కంటైనర్లు గోడౌన్లో ఉన్నాయి. దీంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు గోదాంలో ఎంత మంది ఉన్నారు? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుమ్మడిదల ప్రాంతంలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలే ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇంతకు ముందు శ్రీశైలం జలవిద్యుత్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 12 గంటల పాటు దట్టమైన పొగతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది.
