పీవీకి భారతరత్న ప్రకటించాలి

దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణ తేజం పీవీ’పేరిట సమాలోచన సభ జరిగింది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు విజయవంతంగా నడిపారని కొనియాడారు. తన మేధస్సును దేశం కోసం ఉపయోగించిన ఆయన, రాజకీయాల్లో ప్రత్యర్థులు కూడా పొగిడేంత హుందాతనంతో వ్యవహరించారన్నారు. తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న బుక్‌ క్లబ్‌ పేరును ‘పీవీ బుక్‌ క్లబ్‌’గా మారుస్తున్నట్లు కవిత ప్రకటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు వెల్లడించారు.  
అన్ని రంగాల్లోనూ పీవీ చెరగని ముద్ర.. 
తమ తండ్రి తన జీవిత కాలంలో వివిధ రంగాల్లో చేసిన కృషిని పీవీ కుమార్తె వాణీదేవి గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో తమ తండ్రితో చేసిన ప్రయాణం ఆయన విశిష్టతను అర్థం చేసుకునేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు. సాహిత్యం, సమాజంతో పాటు వ్యవస్థలోని లోటుపాట్ల గురించి పీవీ అనేక రచనలు చేశారని ఆయన తనయుడు పీవీ ప్రభాకర్‌రావు గుర్తు చేసుకున్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 51 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఐదు ఖండాల్లో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ మహేశ్‌ బిగాల వెల్లడించారు. పీవీ రచించిన ఇన్‌సైడర్‌ పుస్తకం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని, పీవీ జీవిత చరిత్రపై బయోపిక్‌ తీసుకురావాలని సీనియర్‌ జర్నలిస్టు కల్లూరి భాస్కరం అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్‌ సాగర్, తెలంగాణ క్రీడా మండలి చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.