మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూమి తెలిపారు. దేశం కోసం ఆయన నిస్వార్థంగా సేవ చేశారన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించే వారని, తాను కలిసిన ప్రతీ సారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్ రాసిన పుస్తకాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తన తరుపున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్ కు నివాళి అర్పించారు.