కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్, అంజిరెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజాగా మరికొందరు రెవెన్యూ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. కీసర నుంచి హన్మకొండకు లింకు కలుస్తున్నది. ఓ జిల్లా ఉన్నతస్థాయి అధికారి సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తాసిల్దార్ నాగరాజును, మరో కీలక నిందితుడు శ్రీనాథ్‌యాదవ్‌ను మూడు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించినప్పుడు కొత్త సంగతులు బయటపడినట్టు సమాచారం. మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతోపాటు కీసర ఆర్డీవో రవి, హన్మకొండ తాసిల్దార్ కిరణ్‌ప్రకాశ్ పేర్లు కొత్త తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురి పేర్లను నాగరాజు తన వాంగ్మూలంలో ప్రస్తావించినట్టు ఏసీబీ ఇంటరాగేషన్ రిపోర్టును బట్టి తెలుస్తున్నదని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేకించి కలెక్టర్, ఆర్డీవో చెప్తేనే తాను హైదరాబాద్ కాప్రాలోని అంజిరెడ్డి ఇంటికి వెళ్లానని నాగరాజు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ప్రస్తావించాడని తెలిసింది. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చెప్పగా.. తనకేమీ తెలియదని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆర్డీవో రవి చెప్తున్నారు. విచారణ సందర్భంగా కేసు అంశాలను నాగరాజు, శ్రీనాథ్ ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్టు వివరించారని సమాచారం.
కలెక్టర్, ఆర్డీవో చెప్తేనే వెళ్లాను: నాగరాజు
ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న శ్రీనాథ్‌కు, తనకు మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని కీసర తాసిల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడని తెలుస్తున్నది. గత నెల 14న జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీవో చెప్తేనే శ్రీనాథ్, అంజిరెడ్డిలతో ఆ భూ వివాదం గురించి చర్చించడానికి వెళ్లానని పేర్కొన్నాడని సమాచారం. వివాదాస్పద భూములపై శ్రీనాథ్, అంజిరెడ్డికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని నాగరాజు స్పష్టం చేశాడని తెలిసింది. ‘ఆగస్టు 14న జిల్లా కలెక్టర్, ఆర్డీవో చెప్పిన మేరకే ఆ భూ వివాదంపై చర్చించేందుకు వెళ్లాను. వాస్తవానికి శ్రీనాథ్‌యాదవ్, అంజిరెడ్డిలకు ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులపరంగా నేరుగా ఎలాంటి యాజమాన్య హక్కులు లేవు. అయినా, మేడ్చల్ కలెక్టర్, కీసర ఆర్డీవో ఆదేశాల మేరకే వెళ్లాను. ఆఫీస్ ముగిసిన తర్వాత ఓ ప్రైవేటు గదిలో అంజిరెడ్డి, శ్రీనాథ్‌లతో నేను భూ వివాదం గురించి చర్చిస్తుండగా ఏసీబీ అధికారులు నన్ను పట్టుకున్నారు. మేడ్చల్ కలెక్టర్, కీసర ఆర్డీవో ఆదేశాలమేరకే నేను అక్కడికి వెళ్లాను’ అని నాగరాజు తన వాంగ్మూలంలో చెప్పాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
హన్మకొండ తాసిల్దార్ పరిచయం చేశాడు: శ్రీనాథ్
కీసర తాసిల్దార్ నాగరాజును తన స్నేహితుడైన హన్మకొండ తాసిల్దార్ కిరణ్‌ప్రకాశ్ తనకు పరిచయం చేశాడని ఈ కేసులో ఏ-3గా ఉన్న శ్రీనాథ్‌యాదవ్ ఏసీబీ అధికారులకు చెప్పాడని తెలిసింది. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు శ్రీనాథ్ నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన శ్రీనాథ్.. ‘సరిగ్గా ఏడాదిక్రితం కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే వ్యక్తిద్వారా ఈ సెటిల్మెంట్ వ్యవహారం నా దృష్టికి వచ్చింది. నేను, తేజేశ్వర్ కలిసి ఈ సెటిల్మెంట్ చేయాలనుకున్నాం. రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డిని అతడి సోదరుడి ద్వారా పరిచయం చేసుకున్నాం. ఈ భూవివాదంలో ఉన్న ముస్లింలను ఇక్బాల్, అవతలివైపు ఉన్న రైతులు, గ్రామస్థులను అంజిరెడ్డి సెటిల్మెంట్లకు ఒప్పించారు. అలా సర్వే నంబర్ 614లోని 61 ఎకరాల 26 గుంటలకు సంబంధించి నా పేరు మీద జీపీఏ రిజిస్ట్రర్ చేయించాను’ అని చెప్పాడని తెలిసింది. తాసిల్దార్ నాగరాజు ఎలా పరిచయం అయ్యాడన్న ప్రశ్నకు శ్రీనాథ్ బదులిస్తూ.. ‘హన్మకొండ తాసిల్దార్ కిరణ్‌ప్రకాశ్ నా స్నేహితుడు. అతడి ద్వారా ఈ ఏడాది మార్చిలో కీసర ఆర్డీవో రవి పరిచయం అయ్యాడు.
అతడి సూచనల మేరకు నేను తాసిల్దార్ నాగరాజు దగ్గరికి వెళ్లాను’ అని వివరించాడని సమాచారం. ఆరోజు పట్టుబడిన కోటీ10 లక్షల రూపాయలను ఎలా సేకరించారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘గత నెల 14 ఉదయం 10 గంటలకు యుగేందర్ అనే స్నేహితుడితో కలిసి కాజీపేటకు వెళ్లి, అక్కడ తేజేశ్వర్ అనే వ్యాపారి సూచనల మేరకు రూ.70 లక్షలను వరంగల్ బస్టాండ్ దగ్గరి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత దేవీటాకీస్ వెనుక మరో వ్యక్తి నుంచి రూ.30 లక్షలు తీసుకున్నా. అనంతరం అంబేద్కర్ భవన్‌కు వెళ్లి అక్కడ రూ.10 లక్షలు తీసుకున్నాం. మొత్తం రూ.కోటి 10 లక్షలు కారు డిక్కీలో పెట్టుకుని హైదరాబాద్‌కు తెచ్చాం’ అని శ్రీనాథ్ చెప్పినట్టు తెలిసింది. అయితే తాసిల్దార్ నాగరాజును తమ పనిచేసిపెట్టమని ఆదేశించేందుకు ఆర్డీవోకు ఏమైనా లంచం ఇచ్చారా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ నోరు మెదపలేదని సమాచారం. ఈ వ్యవహారం చక్కబెట్టేందుకు తాసిల్దార్ ఎంత లంచం డిమాండ్ చేశాడనే ప్రశ్నకు కూడా బదులివ్వలేదని అఫిడవిట్లో పేర్కొన్నారని తెలిసింది.
ఇదీ శ్రీనాథ్ ప్రస్థానం
ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసిన శ్రీనాథ్.. తొలుత డెయిరీఫాం, ఫైనాన్స్, తర్వాత చికెన్ సెంటర్ నిర్వహించాడు. 1994లో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చి, సిమెంట్ కమీషన్ ఏజెంట్‌గా మూడేండ్లు పనిచేశాడు. అక్కడి నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. 2011 పూర్తిస్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి వివాదాల్లో ఉన్న భూముల సెటిల్మెంట్లు ప్రారంభించాడు.
నాపై తప్పుడు ప్రచారం
కీసర ఎమ్మార్వో రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుడు ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొత్త వ్యక్తులు మా వద్దకు వచ్చినప్పడు విచారణ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే సమస్యలను పరిష్కరించాలని చెప్తాం. ఇలా విజిటింగ్ సమయంలో కలిసిన ప్రతి ఆర్జీదారుకు సంబంధించిన విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. మ్యుటేషన్ ప్రక్రియ తాసిల్దార్ చేస్తాడు. కలెక్టర్ దగ్గరకు కనీసం ఫైల్ కూడా రాదు. ఈ కేసులో నా పాత్ర ఉన్నదనే ఆరోపణలు మానుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. – వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్ జిల్లా కలెక్టర్
ఎలాంటి విచారణకైనా సిద్ధం
కీసర తాసిల్దార్ రూ.1.10 కోట్ల లంచం వ్యవహారంతో గానీ, వివాదాస్పద భూమి సెటిల్మెంట్తోగానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా కిందిస్థాయిలో పనులుకానప్పడు ఆర్జీదారులు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారు. ఈ ఆర్జీలపై విచారణ చేయాలని కిందిస్థాయి అధికారులకు చెప్తాం. అది నిబంధనల ప్రకారం ఉంటే చేయాలి, లేదంటే దానిపై మళ్లీ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సమాచారం అందించాలి. ఈ భూమి విషయంలో ఉన్నతాధికారులకు ఎవ్వరికీ సమాచారం కూడా ఇవ్వలేదు. ఎలాంటి ఫైల్ కూడా నా వద్దకు రాలేదు. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం. – రవి, కీసర ఆర్డీవో
నాగరాజు చెప్పిన ఆస్తుల చిట్టా ఇదీ
- కారుణ్య నియామాకాల్లో భాగంగా 1995లో రెవెన్యూశాఖలో చేరిన నాగరాజు.. తక్కువకాలంలోనే ప్రమోషన్లతోపాటు ఆస్తులను కూడబెడుతూ వచ్చాడు. ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో అతడు చెప్పిన ప్రకారం చూస్తే..
- 2011లో ఓసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆయనపై నమోదుచేశారు. అయినా తీరుమార్చుకోలేదు. 2017లో తన స్నేహితుడితో కలిసి శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌లో 3.2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. దీనిలో సగం పొలాన్ని తన భార్య పేరున రిజిస్ట్రర్ చేశాడు.
- 2018లో మాచబొల్లారంలో పవన్ఎన్క్లేవ్లో 988 చదరపు గజాల ఇంటిని తన భార్యపేరిట రూ.45 లక్షలకు కొనుగోలు చేశాడు.
- 2018లోనే 168.66 చదరపు గజాల చొప్పున రెండు స్థలాలను తన పేరిట, మరో 500 చదరపు గజాల స్థలాన్ని రూ.14లక్షలకు తన భార్య పేరిట కొన్నాడు.
- 2019లో మణికొండలో రూ.40 లక్షలతో 500 చదరపు గజాల స్థలాన్ని తన భార్య పేరుతో కొన్నాడు.
- 2020లో కీసర మండలం దయారా గ్రామంలో 400 చదరపు గజాల చొప్పున రెండు స్థలాలను రూ.6 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు పెట్టి తన భార్య పేరిట కొనుగోలు చేశాడు.
- మరికొందరు వ్యక్తుల నుంచి రూ.22 లక్షలు చెక్కుల రూపంలో తీసుకున్నాడు. ఓ వ్యాపారికి చెందిన క్రెటా కారును తన వ్యక్తిగత, ఆఫీస్ అవసరాలకు వాడుతూ దానికి అద్దె చెల్లిస్తున్నాడు.
(Source: NT)