తెలంగాణలోని రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలంగాణలోని రిజిస్ట్రేష‌న్ల శాఖ‌కు రాష్ర్ట‌ ప్ర‌భుత్వం సెల‌వులు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. 

స్టాంపుల కొనుగోలు, చ‌లాన్లు చెల్లించిన వారికి ఇవాళ రిజిస్ర్టేష‌న్లు అవుతాయ‌ని రిజిస్ర్టేష‌న్లు, స్టాంపుల శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు ప్ర‌క‌టించారు. నేటి నుంచి స్టాంపుల ‌విక్ర‌యాలు పూర్తిగా నిలిపివేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా రిజిస్ర్టేష‌న్లు ఆగిపోతాయ‌ని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చ‌ట్టం దృష్ట్యా ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రిజిస్ర్టేష‌న్లు నిలిపివేశామ‌ని చిరంజీవులు తెలిపారు. 

కొత్త రెవెన్యూ చ‌ట్టం దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. మ‌‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోగా రికార్డులను క‌లెక్ట‌రేట్‌లో అప్ప‌గించాల‌ని వీఆర్వోల‌కు స్ప‌ష్టంచేసింది. రికార్డుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల్లోగా పూర్తికావాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. క‌లెక్ట‌ర్ల నుంచి సాయంత్రంలోగా స‌మ‌గ్ర నివేదిక రావాల‌ని ఆదేశించారు.