చారిత్రక రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు, పేదలకు సరళీకృతమైన కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు. రెవెన్యూ బిల్లులోని పలు ముఖ్యాంశాలు.
– ధరణి పోర్టల్‌లో అన్ని వివరాలు ఉంటాయి. పూర్తి పారదర్శకంగా ఉంటుంది
– పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుంది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లాండ్ వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయి
– ప్రపంచంలో ఏ మూలనుంచైనా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు
– కొత్త చట్టం ప్రకారం ఏ అధికారికి విచక్షణాధికారాలు ఉండవు
– కొత్త రెవెన్యూ చట్టంతో ఇకపై ఆస్తి తగాదాలు ఉండవు
– రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్
– మ్యూటేషన్ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగిస్తం
– మ్యూటేషన్ అయిన వెంటనే ధరణిలో అప్లోడ్ కావాలి
– రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్‌బుక్, ధరణి కాపీ వెంటనే తీసుకోవచ్చు
– తెలంగాణ రాష్ట్ర భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉంటుంది.
– ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన
– పాస్ పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం తహసిల్దార్లదే
– వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే బదిలీ చేయాలి
– రికార్డు పూర్తిచేసి కొన్నవారికి బదిలీ చేయాలి
– తప్పుచేసిన తహసీల్దార్‌పై బర్తరఫ్ క్రిమినల్ చర్యలు, తిరిగి భూములు స్వాధీనం
– రికార్డుల్లో సవరణలు చేస్తే ప్రభుత్వం అధికారులపై దావా చేయకూడదు
– డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు
– రుణాల మంజూరుకు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరాదు
– వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ
– వీఆర్ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం
– రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదు
– అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు