ఏపీ మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ పేర్కొంది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని చెప్పింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌తో జగన్ ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్లయింది.

ఇటీవల మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ సైతం ఆమోద ముద్ర వేశారు. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి కొనసాగేలా గవర్నర్ రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానులపై అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను ఆందోళనను కొనసాగిస్తుండగా.. మరో వైపు ఏపీ హైకోర్టులో మూడు రాజధానులపై వాదనలు నడుస్తున్నాయి.