పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభ‌వించింది. మంట‌లు పెద్ద ఎత్తున వ్యాపించ‌డంతో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ రామ‌కృష్ణ అగ్నికి ఆహుత‌య్యాడు. 

రాత్రిపొద్దుపోయిన త‌ర్వాత మంట‌లు పూర్తిస్థాయిలో అదుపులోకి వ‌చ్చాయి. అయితే కార్మికుడు గ‌ల్లంతైన విష‌యాన్నిగుర్తించిన యాజ‌మాన్యం, మంట‌లు ఆరిన త‌ర్వాత అత‌డు మృతిచెందిన విష‌యాన్ని గుర్తించింది. మంట‌లవ‌ల్ల విష‌వాయువులు వ్యాప్తిచెంద‌డం, స్లాబ్ పెచ్చులు ఊడి ప‌డ‌టంతో అత‌డు బ‌య‌టికి రాలేక‌పోయాడ‌ని తెలిపింది. కాగా, ప్ర‌మాదానికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదుచేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.