ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి భారీగా బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ చోడగిరి సతీష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం నకిరేకల్ బైపాస్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేయగా వారి వద్ద బంగారు ఆభరణాలు లభించాయి. నిందితులను మిర్యాలగూడకు చెందిన ఆటో డ్రైవర్ కందుల సందీప్ రెడ్డి, నార్కట్ పల్లి మండలం పొతినేనిపెళ్లికి చెందిన ఆదిమల్ల వెంకన్న, ఆదిమళ్ల జనార్దన్ గా గుర్తించారు.
మునుగోడు, నకిరేకల్, శాలిగౌరారం, నార్కెట్ పల్లి, నల్గొండ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. 35.50 తులాల బంగారం, రూ. 1.80 లక్షల నగదు, ఒక కారు, కిలోన్నర వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిమల్ల వెంకన్న ఒక్కడే 17 కేసుల్లో నిందితుడు కాగా, 9 కేసుల్లో ముగ్గురు కలిసి నిందితులని ఏఎస్పీ సతీష్ తెలిపారు. వీరిని కోర్టులో రిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐలు మోగిలయ్య, బాలగోపాల్ తదితరులు పాల్గొన్నారు.