దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ‘సెరో సర్వే’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. గత మే 11 నుంచి జూన్ 4 మధ్య కాలంలో 28 వేల మందిపై జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహించింది. వీరి రక్త నమూనాలు సేకరించి కోవిడ్ కవచ్ ఎలీసా టెస్ట్ కిట్ ద్వారా వారి రక్తంలో ఐజీజీ యాంటీబాడీస్‌ను పరీక్షించారు. ‘సెరో ప్రివలెన్స్’తక్కువగా ఉన్నట్లు.. మే నెల మధ్యకల్లా జనాభాలో ఒక శాతం కంటే తక్కువ జనాభా మాత్రమే దీంతో ప్రభావితమైనట్లు ఈ సర్వేలో వెల్లడైంది. దేశంలోని అధిక జిల్లాల్లో ఇది తక్కువగా వ్యాప్తి చెందడాన్ని బట్టి కోవిడ్ మహమ్మారి ఇంకా ప్రారంభ దశలో ఉందని, ముందు ముందు మెజారిటీ ప్రజలు ఇంకా వైరస్ బారిన పడే అవకాశాలున్నట్టుగా ఈ సర్వే నివేదిక నొక్కి చెబుతోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు రిపోర్ట్ కాని లేదా స్వల్పసంఖ్యలో నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో అనుమానిత కేసుల వెలికితీతకు మరింత నిఘాతో పాటు టెస్టింగ్‌ల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ఐసీఎంఆర్ సర్వేతో స్పష్టం చేసింది. కాగా, తొలిసారిగా జాతీయస్థాయిలో ఐసీఎంఆర్ నిర్వహించిన సెరో సర్వేలో వెల్లడైన అంశాలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించారు.