రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పై నుంచి వస్తున్న వరదకు తోడు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నీటితో కళకళలాడుతున్నాయి. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,22,217 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఐదు గేట్లు ఎత్తి దిగువకు 1,39,230 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 884.90 అడుగులు ఉండగా, నీటి నిల్వ 215.3263 టీసీఎంల నిల్వ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సైతం ఎగువ నుంచి వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడిచిపెడుతున్నారు. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. సాగర్‌కు ప్రస్తుతం ఇన్‌ఫ్లో 99,776 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 99,776గా ఉంది. నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగుల నీరుంది. అలాగే ప్రస్తుతం 311.25 టీఎంసీలు నిల్వ ఉండగా, పూర్తిస్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలు.