వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్ పొర ప్రాధాన్యతను మంత్రి గుర్తు చేశారు.
కాలుష్య రహిత పరిసరాలతో, జీవ వైవిధ్యంతో ప్రాణకోటి విలసిల్లాలన్నా, మానవులు సుఖశాంతులతో బతకాలన్నా పర్యావరణ సమతౌల్యంతోనే సాధ్యమవుతుందని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకృతి బాగుంటే అందులో భాగమైనమైన సకల జీవకోటి బాగుంటుంది. ప్రకృతిలో భాగమైన ఓజోన్ పొర లేకుండా జీవితం సాధ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఓజోన్ రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతందని తెలిపారు.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్ల కీలకపాత్ర పోషిస్తాయని, అందుకే సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రకృతి సంపదను కాపాడటంతో పాటు జల, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అన్ని చర్యలను పీసీబీ తీసుకుంటుందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కాలుష్య నియంత్రణ మండలి, శాస్త్ర, సాంకేతిక మండలి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, క్లోరోఫ్లోరో కార్బన్ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని, వీటిని వినియోగించడం తగ్గిస్తేనే పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.