మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో ఇటీవల ఏసీబీ కోర్టు ఐదుగురు నిందితులైన మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేశ్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ వాసీం, మాజీ ఆర్డీవో అరుణారెడ్డి, మాజీ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, నగేశ్ బినామీ కోలా జీవన్‌గౌడ్‌లను నాలుగురోజుల కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగా సోమ వారం ఉదయం నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నగేశ్ ఆస్తులు, అక్రమ వ్యవహారాలపై ప్రశ్నించినట్లు సమా చారం. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపారా? అన్న విషయాలపై నగేశ్ నోరు మెదపలేదని సమాచారం. నగేశ్ తమతో పలు అక్రమ వ్యవహాలు చేసేలా ఒత్తిడి పెంచాడని ఇటీవల పలువురు తహసీల్దార్లు చేసిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నగేశ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. వీరి కస్టడీ గడువు ఈ నెల 24తో ముగియనుంది.
