మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మంగళవారం నాటికి 20కి పెరిగింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. భవనం కూలిన 24గంటల తర్వాత రెండున్నరేళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక, ఓ యువ జంట మృతదేహాలను వెలికి తీసినట్లు పేర్కొన్నారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు 25 మందిని రక్షించామని పేర్కొన్నారు. 43 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు కూలిన విషయం తెలిసిందే. ఈ భవనంలో 40 ఫ్లాట్లు ఉండగా, అందులో సుమారు 150 మంది నివసిస్తున్నారు. థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. థానే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండిలో పవర్‌లూం కార్మికులు నివసిస్తుంటారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెతికేందుకు క్యానిన్ స్క్వాడ్‌ను వినియోగిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఈ భవనం భీవండి-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల జాబితాలో లేదు. భవనం యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 304 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని, భవనం కూలిన తర్వాత పౌర అధికారులు ఫిర్యాదు చేశారని భీవండి డీసీపీ రాజ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనపై విచారణ జరుగుతుందని థానే సంరక్షక మంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులైన ప్రతి వ్యక్తికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
