కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మృతి

కరోనాతో రైల్వే సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ సురేశ్‌ అంగడి (65) కన్నుమూశారు. దాదాపు రెండువారాల క్రితం వైరస్‌ సోకడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మరణించారు. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి కావడం గమనార్హం. దేశంలో ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బెళగావి జిల్లా కేకే కొప్ప గ్రామంలో 1955 జూన్‌ 1న సురేశ్‌ అంగడి జన్మించారు. న్యాయశాస్త్రంలో ఆయన పట్టభద్రులు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. 

బెళగావి లోక్‌సభ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు గెలిచారు. కాగా సురేశ్‌ అంగడి మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా, మంత్రిగా నిబద్ధత కలిగిన ఆయన సేవలను మర్చిపోలేమన్నారు. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి సురేశ్‌ కృషి ఎనలేనిదని కొనియాడారు.బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు సురేశ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.