యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని వైఎం డ్రగ్స్ పరిశ్రమలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పరిశ్రమలోని అమ్మోనియం ప్లాంటు వద్ద ఇన్ చార్జ్ ఏడుకొండలు (30) పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ వాల్వ్ నుంచి గ్యాస్ లీకైంది. వాయువు ప్రభావంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లాంటుకు దూరంలో ఉన్న మరో నలుగురు కార్మికులు సైతం అస్వస్థతకు గురయ్యారు. తీవ్రంగా అస్వస్థతకు గురైన ఏడుకొండలును ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరిశీలించి ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. మృతుడు నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన వాడు. ఈ విషయమై సీఐ వెంకన్న మాట్లాడుతూ.. కార్మికుడు మరణించిన విషయం ఉస్మానియా వైద్యశాల నుంచి సమాచారం రావడంతో తెలిసిందన్నారు. పరిశ్రమ నిర్వాహకుల ప్రమాదం గురించి ఎటువంటి సమాచారం అందలేదన్నారు. విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. అస్వస్థతకు గురైన నలుగురిని పరిశ్రమ యజమాన్యం హైదరాబాద్ లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది.