ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  చాకలి ఐలమ్మ 125వ జయంతిని పురస్కరించుకొని శనివారం మడ్‌ఫోర్ట్‌లోని దోబీఘాట్‌లో ఉన్న  ఆమె విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ మహనీయులను గౌరవించలేదనీ, కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా వివక్ష చూపారని మండిపడ్డారు.  రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ  ఉక్కు మహిళ అని కొనియాడారు.  నగరంలోని ట్యాంక్‌బండ్‌పై జాతి గర్వించేలా చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 తెలంగాణ పోరాటయోధులను గౌరవించుకునే సంస్కృతి, సంప్రదాయం మనదని స్థానిక ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సదా కేశవరెడ్డి, లోక్‌నాథం, అనితాప్రభాకర్‌, నళినికిరణ్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, డెరెక్టర్‌ దేవులపల్లి శ్రీనివాస్‌, నేతలు గజ్జెల నగేశ్‌, భానుకా మల్లిఖార్జున్‌, ముప్పిడి గోపాల్‌, శ్యాంకుమార్‌ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రాజారెడ్డి,  రజకసంఘం నాయకులు ఎల్లయ్య, సత్యనారాయణ, బాలయ్య, రాజయ్య, బీమ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.