ఉద్యమంలా కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరవ విడత హరితహారానికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా ముందుకు వెళ్తుంది. వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆనందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రముఖ వైద్యులు మార్కండేయులు తన 46వ పుట్టిన రోజు సందర్భంగా చిలుకూరులో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో 46 మొక్కలు నాటారు.  

అలాగే.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా , గాంధీ జయంతిని పురస్కరించుకొని అర్చమెడిస్‌ గ్రీన్‌ పవర్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సీఈవో గజ్జల సూర్య ప్రకాశ్‌ శామీర్‌పేటలో మొక్కలు నాటారు. జేఎన్టీయూ మాజీ వీసీ విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను శుక్రవారం సూర్యప్రకాశ్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన  ఈ ఉద్యమం ఇలానే కొనసాగాలని కోరుతూ… వారేవా షెఫ్‌ సంజయ్‌ తుమ్మల, క్రికెటర్‌ అంబటి రాయుడు, టెన్నిస్‌ క్రీడాకారిణి పీవీ సింధులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.