- నర్సాపూర్ అడవిలో 3 వేల ఎకరాలు దత్తత
- అటవీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా
- రైతుబిడ్డగా, శాస్త్రవేత్తగా పర్యావరణ పరిరక్షణ
- హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం
- ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూంలో హెటిరో డ్రగ్స్ సీఎండీ బండి పార్థసారథిరెడ్డి
‘నా సంస్థల వల్ల ప్రకృతికి ఎంతో కొంత నష్టం కలిగి ఉంటుంది. దానిని సరిచేసు కోవడం నా నైతిక బాధ్యత. అందుకే అడవిని దత్తత తీసుకొని ప్రకృతికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నా’ అంటున్నారు హెటిరో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బండి పార్థసారథిరెడ్డి. ఆయన వినమ్రతకు, గొప్పమనసుకు ఈ ఒక్క వాక్యమే ఉదాహరణ. అంతర్జాతీయస్థాయి సంస్థకు యజమానిగా మారినా.. ఇప్పటికీ తనను తాను రైతుబిడ్డగానే అభివర్ణించుకుంటారు. ప్రకృతితో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. పచ్చదనం పరుచుకున్న హెటిరో సంస్థ ప్రాంగణాలను చూస్తేచాలు పర్యావరణం పట్ల ఆయనకున్న నిబద్ధత అర్థమవుతుంది. తాజాగా ఆయన 3,000 ఎకరాల అడవిని దత్తత తీసుకొని, అభివృద్ధిచేయడానికి ముందుకొచ్చారు. ఈ బృహత్ సంకల్పానికి సోమవారం తొలిఅడుగు పడనున్నది. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మొత్తం ఎన్ని ఎకరాలు దత్తత తీసుకుంటున్నారు?
నర్సాపూర్ అడవిలో సుమారు 3,000 ఎకరాలను దత్తత తీసుకోబోతున్నాను. ఆ ప్రాంతంలో అడవిని అభివృద్ధిచేసే బాధ్యత తీసుకుంటా. ఇందుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తా. మొదటివిడుతగా సోమవారం రూ.2 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నా.అటవీ అభివృద్ధికి ప్రత్యేకంగా ఏవైనా ప్రణాళికలు రచించారా?అటవీశాఖ అధికారులతో చర్చించా. ప్రణాళికాబద్ధంగా అడవిని ఎలా అభివృద్ధిచేయాలో వారు పక్కా ప్లాన్ రూపొందించారు. ఏ ప్రాంతంలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏయే మొక్కలు ఉండాలి? మొక్కలు నాటడం, సంరక్షణ ఎలా? ఎంతకాలం పడుతుంది? వంటి అంశాలన్నీ వారు నాకు వివరించారు.
దత్తత తీసుకోవడానికి మీకు స్ఫూర్తి?
అడవిని దత్తత తీసుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. 1)మా సంస్థలోని రెడ్‌జోన్‌లో ఉన్న యూనిట్లలో ఔషధాలను తయారుచేసే సమయంలో ఎంతో కొంత రసాయనాలు, కలుషితాలు పర్యావరణంలోకి విడుదల అవుతాయి. ఆ నష్టాన్ని పూడ్చడం నా నైతిక బాధ్యత. 2)నాకు ఎప్పటినుంచో అడవిని దత్తత తీసుకోవాలనే ఆలోచన ఉన్నది. అయితే ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని, అడవిని అభివృద్ధిచేయడం కష్టం. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించి, దేశవ్యాప్తంగా ఉద్యమంలా మొక్కలు నాటిస్తుండటం నాలో స్ఫూర్తిని నింపింది. ఆయనే స్వయంగా మమ్మల్ని సంప్రదించడం, అడవిని దత్తత తీసుకోవాలని కోరడం ఆనందాన్ని ఇచ్చింది. ప్రభుత్వమే అధికారులతో ప్రణాళిక రూపొందించి, వసతులు సమకూర్చడంతో మాలాంటివారికి సగానికిపైగా పని తగ్గిపోతుంది. దీంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకొన్నా.
తెలంగాణకు హరితహారంపై మీ స్పందన?
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన తెలంగాణకు హరితహారం ఒక విప్లవాత్మక కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా ఏటా కోట్ల మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అద్భుతం. ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి దీనిని ఒక ఉద్యమంగాచేపట్టడం వల్ల హరితహారం మారుమూల పల్లెలవరకు చేరింది. మాలాంటివాళ్లు మొక్కలు నాటితే వంద మంది స్ఫూర్తి పొందుతారేమో.. సీఎంస్థాయిలో ఉండే వ్యక్తి మొక్కలు నాటుతూ, అధికార యంత్రాంగం మొత్తాన్ని, ప్రజలను భాగస్వాములనుచేస్తే అది కోట్లాది మందిని కదిలిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న దృష్యమిదే. మొక్కలు నాటాలని పిలుపునివ్వడమే కాదు.. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ కావాల్సినన్ని మొక్కలు అందేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించడం అద్భుతం. సీఎం కేసీఆర్ తన దార్శనికతతో సరైన సమయంలోచేపట్టిన సరైన కార్యక్రమమిది. భవిష్యత్ తరాలు కూడా చల్లగా ఉండాలన్న ఆలోచన ఇది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలోనూ చెట్ల ప్రాధాన్యంపై అవగాహన పెరిగింది. ఇది హరితహారం కాదు.. హరిత ఉద్యమం.
ప్రకృతితో మీకున్న అనుబంధం?
నేనొక రైతు బిడ్డను. వ్యవసాయం అంటేనే ప్రకృతిలో మమేకం కావడం. కాబట్టి పుట్టినప్పటినుంచే నాకు ప్రకృతితో అనుబంధం ఉన్నది. అది చివరివరకు కొనసాగుతుంది. రెండో అంశం.. నేనో శాస్త్రవేత్తను. ప్రకృతి, పర్యావరణం విలువ నాలాంటి వాళ్లకు ఇంకా బాగా తెలుస్తుంది. శాస్త్రవేత్తగా, ఒక కంపెనీ సీఎండీగా ప్రకృతిని కాపాడుకోవడం నా నైతిక బాధ్యత. నా సంస్థల ప్రాంగణాలను పరిశీలిస్తే పార్కుల మాదిరిగా కనిపిస్తాయి. ఆ హరిత స్ఫూర్తిని మరింత రగిలిస్తూ.. అడవిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నా. దీనికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నది.