ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. నర్సింహారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి ఈ ఉదయం తరలించారు.
మాదాపూర్ సైబర్ టవర్ల ఎదురుగా ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కొట్టేయడంలో మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహారెడ్డి భారీ స్కెచ్ వేసినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది.
దాదాపు రూ.50 కోట్ల విలువచేసే 1,960 చదరపు గజాల భూమిని హాంఫట్ చేసిన విధానం షాక్‌కు గురిచేస్తున్నది. ఈ భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చి కొట్టేయడంలో పాత్రధారులుగా ఉన్న 8 మందిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని 1,960 చదరపు గజాల ప్రభుత్వభూమిని రిజిస్ట్రేషన్ చట్టం, 1980లోని సెక్షన్ 22-ఏ(1)(ఏ) కింద ఏపీఐఐసీ, హుడా, ఇతర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమికి యజమానులుగా గోపగోని సజ్జన్‌గౌడ్, పోరెడ్డి తిరుపతిరెడ్డి, ఎర్ర చంద్రశేఖర్, అర్జుల జైపాల్ అలియాస్ గాలిరెడ్డి ఉన్నట్టు పత్రాలు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. తర్వాత ఈ భూమిని వారివారి కొడుకుల పేరిట గిఫ్ట్‌డీడ్ కింద విక్రయించినట్టుగా 2016లో పత్రాలు పుట్టించారు. 2018లో అదే భూమిని ఏసీపీ నర్సింహారెడ్డి తన భార్య మంగతోపాటు మధుకర్ శ్రీరాం, బండి చంద్రారెడ్డి, బత్తిని రమేశ్, అలుగుబెల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరిట రిజిస్టర్ చేయించాడు. ఇందుకోసం ఒక్కో స్థలానికి రూ. 20 లక్షల చొప్పున రూ.80 లక్షలు చెల్లించినట్టుగా పత్రాలు సృష్టించారు.