రెండో రోజు ఏసీబీ క‌స్ట‌డీకి ఏసీపీ న‌ర్సింహారెడ్డి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి మాజీ ఏసీపీ న‌ర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు రెండో రోజు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. న‌ర్సింహారెడ్డికి సంబంధించిన మ‌రో బ్యాంకు లాక‌ర్‌ను ఏసీబీ అధికారులు ఇవాళ తెరిచే అవ‌కాశం ఉంది. బినామీల పేరిట ఆస్తులు కూడ‌బెట్టిన వ్య‌వ‌హారంపై అధికారులు ఆయ‌న‌ను విచారిస్తున్నారు. నాలుగు రోజుల క‌స్ట‌డీలో భాగంగా నిన్న‌టి నుంచి ఏసీబీ అధికారులు ఆయ‌న‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. 

నిన్న ప్ర‌ధానంగా ఏసీబీ సోదాల్లో పట్టు‌బ‌డిన రూ.70 కోట్ల మేర అక్ర‌మా‌స్తు‌ల‌తో‌పాటు మాదా‌పూ‌ర్‌‌లోని రూ.50 కోట్ల విలు‌వైన భూమిపై ప్రశ్నిం‌చి‌నట్టు తెలి‌సింది. ఏసీపీ నుంచి ఆశిం‌చిన మేర సమా‌ధా‌నాలు రాలే‌దని సమా‌చారం. ఈ అంశానికి సంబంధించి ఇవాళ‌ మరో‌మారు ప్రశ్నిం‌చ‌ను‌న్నారు. నర్సిం‌హా‌రెడ్డి తెర‌లే‌పిన భూ ‘కొ‌ను‌గోలు’ దందాలో ఇప్ప‌టికే 8 మందిని ఏసీబీ అరె‌స్టు‌చే‌సిన విషయం తెలి‌సిందే. ఈ కేసులో నలు‌గురు నింది‌తులు తమ తండ్రుల నుంచి గిఫ్ట్‌‌డీ‌డ్‌ల కింద సదరు భూమి వచ్చి‌నట్టు యాజ‌మాన్య పత్రాలు సృష్టించి, విక్ర‌యిం‌చి‌నట్టు ఇప్ప‌టికే ఆధా‌రాలు లభిం‌చాయి. గిఫ్ట్‌‌డీ‌డ్‌‌లను ఇస్తూ సంత‌కాలు పెట్టిన మరో ముగ్గురి కోసం ఏసీబీ అధి‌కా‌రులు గాలి‌స్తు‌న్నట్టు తెలి‌సింది. ఈ వ్యవ‌హా‌రంలో మొత్తం 13 మంది నింది‌తులు కాగా, వీరిలో ఏ2 గోప‌గోని రాజ‌లింగం, ఏ4 పోరెడ్డి వెంక‌ట్‌‌రెడ్డి, ఏ6 ఎర్ర శంక‌రయ్య, ఏ8 అర్జుల గాలి‌రెడ్డి పరా‌రీలో ఉన్నట్టు సమా‌చారం.