బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శనం టికెట్లు నేడు విడుదల : టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనుంది. ఇప్పటికే అక్టోబర్‌ మాసానికి సంబంధించిన ప్రత్యేక దర్శనం రూ.300 కోటాను విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 15వ తేదీ నుంచి 24 మధ్య దర్శనం టికెట్లను విడుదల చేయలేదు. బ్రహ్మోత్సవాల్లో దర్శనం టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు తిరుమలకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది. టికెట్లు ఉన్న యాత్రికులకే మూలమూర్తి, వాహనసేవలను దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు వివరించింది.