గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన సినీ దర్శకుడు శేఖర్ క‌మ్ముల‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల పాల్గొన్నారు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ లో భాగంగా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్ క‌మ్ముల‌ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు పర్యావరణ ప్రేమికులు మొక్కలు నరకడం తట్టుకోలేక ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారంటే అయన పర్యావరణ ప్రేమికుడిగా ఎంతగా గుర్తింపు పొందారో అర్ధం అవుతుందద‌న్నారు.

సీఎం కేసీఆర్ కు బాసటగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను శేఖర్ క‌మ్ముల ప్రత్యేకంగా అభినందించారు. లవ్ స్టోరీ చిత్ర యూనిట్ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.