కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్(74) క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న‌ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. రాం విలాస్ పాశ్వాన్ ఇటీవల ఢిల్లీ ఆస్ప‌త్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ దళిత నాయకులలో ఒకరైన పాశ్వాన్ గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. గుండె సంబంధ ఇబ్బందుల‌తో ఆయ‌న చాలాకాలంగా బాధ‌ప‌డుతున్న‌ట్లుగా స‌మాచారం. తన తండ్రి మరణం గురించి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేస్తూ.. “పాపా… ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో లేరు కానీ మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ నాతోనే ఉంటార‌ని తెలుసు. మిస్ యు పాపా అని పేర్కొన్నారు.

తండ్రి ఆరోగ్యం గురించి ఇటీవ‌లే చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ… గత కొన్ని రోజులుగా నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం కొన్ని ఆకస్మిక పరిణామాల కారణంగా అర్ధరాత్రి సమయంలో గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అవసరమైతే మ‌రికొన్ని వారాల తర్వాత కూడా మరొక ఆపరేషన్ నిర్వహించాల్సి రావ‌చ్చు. ఈ పోరాటంలో త‌న‌కు, త‌న కుటుంబానికి అండగా నిలిచిన ప్ర‌తీఒక్క‌రికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. 

రాం విలాస్ పాశ్వాన్ 1946 జులై 5న బిహార్‌లోని ఖ‌గారియాలో జ‌న్మించారు. పాశ్వాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. ఎనిమిదిసార్లు లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. 1969లో సంయుక్త సోష‌లిస్ట్ పార్టీ నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు. 1974లో లోక్‌ద‌ళ్ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. 1975లో ఎమ‌ర్జెన్సీని వ్య‌తిరేకించి జైలుకు వెళ్లాడు. 1977లో జైలు నుంచి విడుద‌ల‌య్యాక జ‌న‌తా పార్టీలో చేరారు. 1977లో అత్య‌ధిక మెజార్జీతో గెలిచి రికార్డు సృష్టించారు.

అనంత‌రం 2000లో లోక్‌జ‌న్‌శ‌క్తి పార్టీని స్థాపించారు. వి.పి.సింగ్‌, దేవేగౌడ‌, ఐ.కె.గుజ్రాల్‌, వాజపేయీ నేతృత్వంలోని ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. కేంద్ర మంత్రివ‌ర్గంలో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. 1996 నుంచి 1998 వ‌ర‌కు రైల్వేశాఖ మంత్రిగా, 1999 నుంచి 2001 వ‌ర‌కు క‌మ్యూనికేష‌న్లశాఖ మంత్రిగా, 2004లో యూపీఏ హ‌యాంలో ఉక్కు, ఎరువులు, ర‌సాయ‌నాల‌శాఖ మంత్రిగా పాశ్వాన్ సేవ‌లందించారు.