కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి స్పందిస్తూ… రాం విలాస్ పాశ్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందన్నారు. పార్లమెంటులో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరన్నారు. అత్యంత చురుకైన వ్యక్తి అని కొనియాడారు. అణగారినవర్గాల గొంతుక, అట్టడుగున ఉన్నవారికి ఉన్నతికి కృషిచేసిన వ్యక్తి అని కొనియాడారు. యువతలో ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ సమయంలో జయప్రకాష్ నారాయణ్ వంటి మెంటార్‌లను కలిగిన వ్యక్తి. ప్రజల సంక్షేమం కోసం తీవ్రంగా శ్రమించాడు. పాశ్వన్ మృతిపట్ల ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ స్పందిస్తూ.. మంచి మిత్రుడు, గొప్ప సహచరుడిని కోల్పోయానన్నారు. పేదలు హుందాగా జీవించడానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి అన్నారు. యువ నాయకుడిగా అతను ఎమర్జెన్సీ సమయంలో దౌర్జన్యాన్ని, మన ప్రజాస్వామ్యంపై దాడిని ప్రతిఘటించాడన్నారు. కేబినెట్ సమావేశాల సందర్భంగా ఆయన సలహాలు ఎంతో ఉపయుక్తమన్నారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ప్రధాని సంతాపం తెలిపారు.