త్వరలో ఎన్నిక జరుగనున్న హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జిగా ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆలోచనలకు అనుగుణంగా తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధంగా నిర్వహిస్తానని శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునే వరకు పార్టీ శ్రేణులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. వచ్చే మార్చిలో గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఓటర్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
