నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత చ‌రిత్ర సృష్టించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ చరిత్ర‌లోనే ఆమె అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌విత ఘ‌న‌విజ‌యం సాధించారు. మొత్తం 823 ఓట్లలో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. 

ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు : క‌విత

ఈ సంద‌ర్భంగా క‌విత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌హ‌క‌రించి, గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు, చైర్మ‌న్ల‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌విత ధ‌న్య‌వాదాలు చెప్పారు. 

గెలుపు ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న క‌విత‌

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌వితకు గెలుపు ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ నారాయ‌ణ‌రెడ్డి అంద‌జేశారు. ఈ కార్యక్ర‌మంలో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మెజార్టీ సాధించిన క‌విత‌కు టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు శుభాకాంక్ష‌లు తెలిపారు.