తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. వరదల వల్ల పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగిందని, ఈ ఏడాది పంట బీమా పథకం అమలు కాలేదని పేర్కొన్నది. ఆ సంస్థ అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో కమిటీ సమావేశమైంది. కరోనా అనంతరం సామాజిక పరిణామా లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు- ప్రజలపై ప్రభావంపై చర్చించారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు, వ్యవసాయ చట్టాలు రైతులకు గుదిబండగా మారుతాయన్నారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ చట్టం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. టీవీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించిన ఈ సదస్సులో టీవీఎస్ ఉపాధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, సలహాదారు సీతారామారావు, లింబాద్రి, వినయ్‌బాబు, వేణుగోపాలస్వామి, కవ్వ లక్ష్మారెడ్డి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జయంతి, రవీంద్ర, విజయ్ ఆనంద్, పులిరాజు, వెంకన్న, రమేశ్, రాజు, మహేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రావు, సురేశ్ పాల్గొన్నారు.
