ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది : మంత్రి మల్లారెడ్డి

ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం నేనున్నానంటూ అండగా నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌లో మొన్న కురిసిన భారీ వర్షాలతో ఫిట్స్‌ (మూర్ఛ)తో నాలాలో పడి మృతి చెందిన మహమ్మద్‌ సమీద్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైంది. ఈ మేరకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే సమీద్‌ మృతి చెందడం బాధాకరమన్నారు.

సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై దిగ్భ్రాంతి చెంది, వెంటనే కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రూ.5లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారని, ఈ మేరకు ఇంటికి వచ్చి చెక్కును అందజేసినట్లు చెప్పారు. ఆపదలో ఉన్నవారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సైతం ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు అందజేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటామన్నారు. వారి వెంట కార్పొరేటర్‌ సభిహ బేగం ఉన్నారు.