హైద‌రాబాద్ వ్యాప్తంగా భారీ వ‌ర్షం

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం ముంచెత్తింది. న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. భారీ వాన‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం 100కు డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. హుస్సేన్ సాగ‌ర్ నిండు కుండలా మార‌డంతో దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.