చెరువుల పరిశీలనకు 15 ఇంజినీర్ల బృందాలు : నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని 185 చెరువులు పూర్తిగా నిండాయని నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. రానున్న రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో చెరువుల పటిష్ఠత, స్థితిగతులను పరిశీలించేందుకు ఇంజినీర్లతో 15 బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

ఇంజినీర్ల బృందం అన్ని చెరువుల పటిష్ఠత, స్థితిగతులను పరిశీలిస్తుందని చెప్పారు. కట్టలు, తూములు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు అవసమైన నిధులను వెంటనే మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గత వందేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో భారీవర్షాలు పడ్డాయని, దీంతో చెరువులు పూర్తిగా నిండాయని అన్నారు.