తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవల నాగరాజు ఆత్మహత్యకు పాల్పడటంలో కేసును మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో నాగరాజు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. నాగరాజు బినామీ నందగోపాల్ పేరుతో ఉన్న ఈ లాకర్లో దాదాపు కేజీకిపైగా బంగారు ఆభరణాలను గుర్తించారు. దీనిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇతర ఖాతాలపై విచారణ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నందగోపాల్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా.. లాకర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లాకర్లు ఓపెన్ చేయగా.. పెద్ద ఎత్తున బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతకు ముందు మరో బ్యాంక్ లాకర్లలో రెండు కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసులో పట్టుబడ్డ నిందితులంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.