తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడిన 1,603 మంది పాత్రికేయులకు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి రూ.3.12 కోట్లు ఆర్థికసాయం అందజేశామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకున్నదని చెప్పారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమాచార భవన్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వార్తా సేకరణలో ఉన్న జర్నలిస్టుల్లో 1,517 మందికి కరోనా సోకిందని తెలిపారు. మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.3,03,40,000, హోం క్వారంటైన్‌లో ఉన్న 86 మంది జర్నలిస్టులకు రూ.8.6 లక్షలు అందించామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో తీసుకున్న నిర్ణయమే నేడు రక్షణ కవచంలా మారిందని పేర్కొన్నారు.
ఇందులో రూ.34.50 కోట్లు జర్నలిస్టు సంక్షేమ నిధికి జమయ్యాయని, వాటి వడ్డీతోనే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. కరోనా బారినపడి ఆర్థికసాయం కావాలనుకునే జర్నలిస్టు మిత్రులు తమ వివరాలను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వాట్సాప్ 80966 77444, మేనేజర్ లక్ష్మణ్‌కుమార్ 96766 47807 నంబర్లకు పంపించాలని సూచించారు. ఇప్పటివరకు చనిపోయిన 260 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రూ.2.6 కోట్ల ఆర్థికసాయం అందించామని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల బారినపడిన 94 మందికి రూ.50 వేల చొప్పున రూ.47 లక్షల సాయంచేశామని చెప్పారు. ఆర్థికసాయం, ట్యూషన్ ఫీజు, పింఛన్లు కలుపుకొని మొత్తంగా ఇప్పటివరకు రూ.5.12 కోట్ల సాయం అందించినట్టు ఆయన వివరించారు. సమావేశంలో మీడియా అకాడమీ కార్యదర్శి డీఎస్ జగన్, మేనేజర్ లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.