వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేత కోసమే ఏర్పడిన నకిలీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా కంపెనీలతో ఓ ‘రిస్కీ’ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఇద్దరు తెలిపారు. కృత్రిమ మేధస్సు, ఆధార్ నమోదు ఆధారంగా ఈ మోసపూరిత సంస్థల కార్యకలాపాలను చాలా దగ్గరగా గమనించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను అక్రమంగా పొందుతున్న ఎగుమతిదారులతో కేంద్ర ప్రభుత్వం ఓ ‘రిస్కీ’ ఎక్స్‌పోర్టర్స్ లిస్టును తయారు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఏ వ్యాపారం లేకుండా జీఎస్టీ రిఫండ్స్‌ను తీసుకుంటున్న సంస్థల భరతం పట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి ఎన్నో బోగస్ కంపెనీలు జీఎస్టీ రిఫండ్స్‌ను పొందుతున్నాయని, ఇటీవలే పుణెలో ఇలాంటి ఓ సంస్థను గుర్తించామని అధికారులు చెప్తున్నారు.
