భూ లావాదేవీలకు ఆయువు పట్టుగా మారనున్న ‘ధరణి’ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెస్తున్నది. ధరణి ప్రారంభంతోనే తాసిల్దార్ కార్యాలయాలలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సేవలను చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన సర్వం సిద్ధం చేసింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు వేర్వేరుగా తాసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తాసిల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా పది లావాదేవీలను సక్సెస్‌గా నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు పూర్తికాగానే మ్యుటేషన్ పూర్తవుతుంది. తాసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, స్కానర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం అనుభవం ఉన్న డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్‌లను సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గురువారం సీఎం కేసీఆర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఆ వెంటనే అన్ని తాసిల్దార్ కార్యాలయాలలో అధికారులు ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.
