దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా వెల్లడించింది. వజీపూర్ సమీపంలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 382గా నమోదైందని పేర్కొంది. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ ఢిల్లీ యాప్‌ను ప్రారంభించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజలు యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
పారిశ్రామిక కంపెనీల నుంచి పొల్యూషన్ వెలువడితే ఫొటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేస్తే, చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కాగా, దేశంలో గత 58 ఏండ్లలో ఇదే (2020 అక్టోబర్) అత్యంత చల్లని అక్టోబర్ అని భారత వాతావరణ కేంద్రం (ఇండియన్ మెటియరాలాజికల్ డిపార్టుమెంట్-IMD) శనివారం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో 1962 అక్టోబర్ తర్వాల అక్టోబర్ నెలలో వాతావరణం ఇంత చల్లగా ఉండడం ఇదే మొదటిసారని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీలో ఈ అక్టోబర్‌లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 17.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు కాగా, అక్టోబర్ 29న అత్యంత తక్కువగా 12.5 డిగ్రీ సెల్షియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యిందని భారత వాతావరణ కేంద్రం చెప్పింది.